ఇందిరానగర్ మాజీ సర్పంచ్ కడారి రమ ప్రసాద్ బీజేపీలో చేరిక
బండి సంజయ్ సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం
ఎల్కతుర్తి. డిసెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కడారి రమ ప్రసాద్ బీజేపీలో చేరారు. బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కడారి రమ ప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కడారి రమ ప్రసాద్ మాట్లాడుతూ దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తున్న బీజేపీ విధానాలు తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఇందిరానగర్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత, మహిళలను పార్టీలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్ గారు కడారి రమ ప్రసాద్ లాంటి అనుభవజ్ఞులు బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కృషి కీలకమని పేర్కొన్నారు.
మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ఇందిరానగర్ గ్రామంలో బీజేపీకి ప్రజాబలం మరింత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ రానున్న రోజుల్లో ఎల్కతుర్తి మండలంలో బీజేపీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments