యేసు బోధనలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.!
విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు.
సత్తుపల్లి, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
యేసు క్రీస్తు బోధనలు విద్యార్థుల చదువు, ప్రవర్తన, జీవిత లక్ష్యాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం విశ్వశాంతి విద్యాలయంలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు మహిమను ప్రతిబింబించే గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. అనంతరం కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, యేసు బోధనలు అలవర్చుకుంటే విద్యార్థులు స్నేహితులు, ఉపాధ్యాయులతో సౌహార్దపూర్వకంగా మెలగడం నేర్చుకుంటారని చెప్పారు. ప్రేమ, దయ, సేవాభావం, క్షమ గుణాల వల్ల కోపం, ద్వేషం తగ్గి మంచి మనసు అలవడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అహంకారం లేకుండా వినయం, ఇతరులకు సహాయం చేయడం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సహనం, క్రమశిక్షణ, ఇతరులను గౌరవించడం వంటి గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. మంచి ఆలోచనలు, మంచి జీవన మార్గాన్ని అనుసరించే వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు.
యేసు బోధనలు విద్యార్థుల్లో మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని విజయవంతమైన, మానవత్వం గల వ్యక్తులుగా తయారు చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, క్షమ వంటి గొప్ప విలువలను యేసు క్రీస్తు బోధించారని గుర్తు చేశారు.
“ప్రేమించండి – సేవ చేయండి – క్షమించండి” అనేదే యేసు జీవిత సందేశమని తెలిపారు. ప్రేమ వల్ల ఇతరులను గౌరవించడం, క్షమ వల్ల కోపం, ద్వేషం దూరమవుతాయని, నిజాయితీ వల్ల జీవితం వెలుగొందుతుందని వివరించారు.
అలాగే క్రిస్మస్ ట్రీ, స్టార్, కేక్‌ల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.


Comments