గ్లాస్ బ్లోయింగ్ రంగంలో లైఫ్‌టైం అచీవ్మెంట్
బొమ్మగాని రుక్కయ్యకు ఘన సన్మానం
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం కమలానగర్ కార్యాలయంలో గ్లాస్ బ్లోయింగ్ టెక్నాలజీ రంగంలో లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు సాధించిన స్ఫూర్తి గ్రూప్ నాయకులు బొమ్మగాని రుక్కయ్యను ఆత్మీయంగా అభినందించారు.ఈ అభినందన కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుక్కయ్య ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన గ్లాస్ బ్లోయింగ్ విభాగంలో దీర్ఘకాలంగా పనిచేస్తూ అనేక శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన గ్లాస్ బ్లోయింగ్ పరికరాలను తయారు చేసి విశేష సేవలందించారని తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ చాప్టర్‌తో అనుబంధం కలిగి అఖిల భారత స్థాయిలో అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. నవంబర్ 28న మద్రాస్ ఐఐటీలో జరిగిన అఖిలభారత చాప్టర్ కన్వెన్షన్‌లో రుక్కయ్యకు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయడం గర్వకారణమని అన్నారు.రుక్కయ్య దాదాపు 300కు పైగా నాటికలలో నటించి తన కళానైపుణ్యాన్ని చాటుకున్నారని, అలాగే యోగా ఉపాధ్యాయుడిగా అనేక మందికి యోగాభ్యాసం నేర్పించారని తెలిపారు.స్ఫూర్తి గ్రూప్ నిర్వహించే పలు ప్రచురణల్లో తన వ్యాసాలతోనూ సేవలందించారని పేర్కొంటూ ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో కోమటి రవి, మల్లేశం తదితరులు ప్రసంగించారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు మల్లేశం చేనేత వస్త్రాలతో బొమ్మగాని రుక్కయ్యను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రుక్కయ్య మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీలో గ్లాస్ బ్లోయింగ్ విభాగంలో పనిచేయడం ద్వారా అనేక శాస్త్రీయ పరిశోధనలకు తన వంతు సహకారం అందించినందుకు గర్వంగా ఉందన్నారు. స్ఫూర్తి గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తన వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.భవిష్యత్తు లో కూడా స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు.తనను అభినందించిన స్ఫూర్తి గ్రూప్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, అబ్దుల్ రహీం, శివన్నారాయణ, జయరాజ్, శ్రీనివాసరావు, గౌసియా, గిరీష్, గుమ్మడి హరిప్రసాద్, ఎం.భాస్కరరావు, వెంకటయ్య, కోమటి రవి, మల్లేశం, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments