మంచి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి
డ్రగ్స్, మైనర్లకు మద్యం పై ఉక్కుపాదం : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
రాచకొండ, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
నూతన సంవత్సర వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ప్రజలకు, నిర్వాహకులకు పిలుపునిచ్చారు. ఒక్క ప్రమాదం కూడా జరగకూడదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై రాచకొండ పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేడుకల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తాయని తెలిపారు.మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాయని స్పష్టం చేశారు.ఔట్‌డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. నిర్ణయించిన పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించరా దని ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపడతామని, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయానికి మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలని, పబ్‌లు, రెస్టారెంట్లు, షాపుల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.నగర శివార్లలోని ఫామ్ హౌస్‌లలో నిర్వహించే కార్యక్రమాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని, డ్రగ్స్ వినియోగం, అసభ్యకర డాన్స్ కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా, బైక్ రేసులు జరగకుండా కొన్ని ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి ఐపీఎస్, ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ ఐపీఎస్, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments