గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.!
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.
దమ్మపేట, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ భవనాలు ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా ఉండాలని అన్నారు. అలాగే కమ్యూనిటీ భవనాలు గ్రామస్తుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామంలో అవసరమైన ప్రభుత్వ భవనాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 


Comments