మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కదలిరావాలి:
ఈగల్ టీం డీఎస్పీ సైదులు
నాచారం, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ అత్యంత కీలకమని ఈగల్ టీం డీఎస్పీ సైదులు అన్నారు. నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం నిర్వాహకులు, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటి నగర్ పార్క్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు కాలనీలలో ర్యాలీ సాగుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు మాట్లాడుతూ, యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నియంత్రణను ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ క్రయవిక్రయాలకు పాల్పడితే వెంటనే 1908 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం నిర్వాహకులను ఆయన అభినందించారు.మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి, నందికొండ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణపై రెండవసారి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ సిబ్బంది, ఈగల్ టీం సిబ్బంది, నాచారం మరియు హెచ్ఎంటినగర్ డెవలప్మెంట్ ఫోరమ్ సభ్యులు పాల్గొన్నారు.


Comments