జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
_జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కీలక తీర్మానం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన అన్ని ప్రసార మాధ్యమాల్లో పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్, 60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం, ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది.ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 48 జర్నలిస్టు సంఘాలు పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో భారీ మహా జాతర నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించాలని జేఏసీ నిర్ణయించింది. జర్నలిస్టులు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలు కాదనే విషయాన్ని స్పష్టంగా చాటేలా సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పాశం యాదగిరి మాట్లాడుతూ సోషల్ మీడియాను నియంత్రించాలనే అంతర్గత ఉద్దేశంతోనే ప్రభుత్వం అక్రెడిటేషన్ నాటకానికి తెరలేపిందని విమర్శించారు. జీవో 252లోని లోపాలను వెంటనే సరిచేసి జర్నలిస్టులపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షోపన్యాసం చేసిన మామిడి సోమయ్య మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలే నేటికీ కొనసాగుతున్నాయని, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ప్రభుత్వాలు జర్నలిస్టుల మౌలిక సమస్యలను పరిష్కరించి ముందుకు సాగాలని కోరారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటులో కేబుల్ టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పాత్ర కీలకమని గుర్తు చేశారు. గతంలో జర్నలిస్టుల వ్యతిరేక జీవోలను ఢిల్లీలో ధర్నాలు చేసి రద్దు చేయించామని, ప్రస్తుతం జరుగుతున్న అక్రెడిటేషన్ వివాదాన్ని వెంటనే ఆపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ పరిశోధనాత్మక పాత్రికేయుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల పేరుతో అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వారి వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. జర్నలిస్టుల మహా జాతర ద్వారా వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖ జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్లుగా కే.కోటేశ్వర్ రావు, మామిడి సోమయ్య, అనంచిన్ని వెంకటేశ్వరరావు, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, మమతా రెడ్డి, భైసా సంగీతను ఎంపిక చేశారు. కో-కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.జేఏసీ కమిటీలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) నుంచి అనంచిన్ని వెంకటేశ్వరరావు, మహిళా విభాగం నుంచి మమతా రెడ్డి, భైసా సంగీత, సోషల్ మీడియా ఇంఛార్జిగా బాపట్ల కృష్ణమోహన్ ఎంపిక కావడంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.


Comments