గ్రామ అభివృద్ధికి ముందడుగు..
కాకరవాయి సర్పంచ్ గూడూరు ఉపేందర్..
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)
కాకరవాయి గ్రామం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవనే లక్ష్యంగా చేసుకొని పాలన సాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.గ్రామంలో ఎన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటూ, వీధి దీపాల ఏర్పాటు, త్రాగునీటి వసతుల మెరుగుదల వంటి కీలక అంశాలను ప్రాధాన్యతగా చేపట్టారు. ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాలు అందించాలనే సంకల్పంతో పాలకవర్గం పని చేస్తోందని సర్పంచ్ ఉపేందర్ స్పష్టం చేశారు.
"కాకరవాయిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సమస్యలే నా రాజకీయాలు"అని సర్పంచ్ గూడూరు ఉపేందర్ ఓ ప్రకటన ద్వారా ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వెంటనే స్పందిస్తున్న తీరుకు గ్రామ ప్రజల నుంచి విస్తృత ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పార్టీలకతీతంగా అందరికీ సమాన న్యాయం చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ ఉపేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో, ప్రజల భాగస్వామ్యంతోకాకరవాయి గ్రామాన్ని జిల్లాకే ఆదర్శంగా నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


Comments