కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం
కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, జనవరి 8 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలోని నిరుపేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్‌గడ్ మండల కేంద్రం మరియు స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో జఫర్‌గడ్, ఐనవోలు మండలాలకు చెందిన 77 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.77,08,932 విలువైన చెక్కులు, 30 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.10,52,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన 66 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.66,07,656 విలువైన చెక్కులు, 22 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.11,18,500 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అవినీతి, అక్రమాలకు తావులేకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లోనే లబ్ధిదారులకు చెక్కులు అందుతున్నాయని, ఇందుకోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు అయినా డబ్బులు అడిగితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఉచిత సన్నబియ్యం పంపిణీ, నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇల్లులేని వారికి ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఇందులో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇప్పటివరకు 93 శాతం ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.
కొంతమంది ఆధారాలు లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు తానే 100 పడకల ఆసుపత్రి తెచ్చానని చెబుతూనే, మరోవైపు మున్సిపాలిటీ కాకుండా అడ్డుపడ్డానని మాట్లాడటం పూర్తిగా అవగాహనలేని వ్యాఖ్యలని విమర్శించారు. జనవరి 2024 తర్వాత జారీ అయిన జీవోల ఆధారంగానే నియోజకవర్గానికి అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, వాటి పూర్తి వివరాలను జీవో కాపీలతో సహా మీడియా, ప్రజల ముందు ఉంచినట్లు తెలిపారు. అయినా వాస్తవాలను విస్మరించి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ఏకైక లక్ష్యమని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, తహసీల్దార్లు, సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



Comments