దివ్యాంగులు విద్యలో ముందుకు సాగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, వారు చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.బుధవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో జిల్లాలోని 730 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు.గత సంవత్సరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ భవన నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దివ్యాంగులు ఎక్కడా తక్కువ కాదని, సమాజంలోని అన్ని రంగాల్లో సకలాంగులతో సమానంగా పోటీ పడుతూ తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు 70.73 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలు అందజేసినందుకు సంబంధిత యాజమాన్యాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ల సామాజిక బాధ్యత నిధులు, అభివృద్ధి నిధులు వనపర్తి జిల్లాకు అధికంగా కేటాయించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయగా, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 మందికి ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, గ్రిడ్ కార్యనిర్వహక సంచాలకులు ఎం.కె. రమేష్, మార్కెట్ యార్డు అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్
ఆర్డీవో సుబ్రమణ్యం, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుఫిన్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, దివ్యాంగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మీసాల మోహన్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.


Comments