వడ్డెరల సమస్యలపై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారికి వినతి
వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్‌ను వనపర్తి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దాసర్ల భూమయ్య మర్యాదపూర్వకంగా కలిసి వడ్డెర కులానికి సంబంధించిన సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా దాసర్ల భూమయ్య మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలోని వడ్డెరలు సంప్రదాయ కులవృత్తి అయిన రాయికోట్టే పనిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కులవృత్తి చేసుకునేందుకు అత్యాధునిక యంత్రాలను పూర్తి సబ్సిడీపై అందజేయాలని, ఆ యంత్రాల నిర్వహణకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.అలాగే గుట్టలు, క్వారీలపై పూర్తి అధికారం వడ్డెర్లకే కల్పించాలని, ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వడ్డెర ఫెడరేషన్‌ను వడ్డెర కార్పొరేషన్‌గా మార్చి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈనెల జనవరి 11న వడ్డెర్ల ఐకాన్ శ్రీ వడ్డే ఓబన్న 219వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా, జిల్లా కేంద్రంలో కూడా అధికారికంగా ఘనంగా నిర్వహించాలని కోరుతూ వినతి పత్రాన్ని అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓర్సు వెంకటయ్య, జిల్లా కోశాధికారి ముద్దల ఈశ్వర్, జిల్లా నాయకులు స్వామి రాంచందర్, కొమిరే ఆంజనేయులు, పసుపుల కృష్ణయ్య, రాంబాబు, దాసర్ల బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.


Comments