సైన్స్ ఎగ్జిబిషన్ తరహాలో హిందీ భాషా మేళను నిర్వహించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం
వరంగల్,జనవరి 08(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా అధ్యక్షత వహించారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయులు సిహెచ్ రాములు, కోటేశ్వర్ నిర్వహణలో హిందీ భాషా మేళను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు వివిధ కృత్యాలు, టిఎల్ఎంలు, భాషా సంబంధిత నమూనాలను ప్రదర్శించారు.
ఈ భాషా మేళను హనుమకొండ జిల్లా విద్యాధికారి ఎల్వి గిరిరాజ్ గౌడ్ ప్రారంభించారు. హిందీ పాఠ్యాంశాల ఆధారంగా ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థినిలు రూపొందించిన టిఎల్ఎంలు, వ్యాకరణ అంశాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులే స్వయంగా వివరణలు ఇస్తూ నిర్వహించిన విధానం ప్రశంసనీయంగా ఉందని జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు. భాష మానవ జీవనానికి మూలాధారమని, భాషపై మక్కువ పెంచుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి పాఠాన్ని చిత్రాలు, కృత్యాల రూపంలో ప్రదర్శించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు వినడం, పరిశీలించడం, పరిశోధించడం ద్వారా తమలోని నైపుణ్యాలను పెంపొందించుకొని స్వతంత్రంగా ఎదగాలని సూచించారు. సైన్స్ ఎగ్జిబిషన్ తరహాలో హిందీ భాషా మేళను నిర్వహించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ భాషా అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నాయని తెలిపారు. హిందీ ఉపాధ్యాయుడు సిహెచ్ రాములు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలే తనకు నిజమైన బహుమానమని, వారి సృజనశక్తిని వెలికి తీయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థినులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించారు. కార్యక్రమంలో విమల, శ్రీదేవి, రమాదేవి, నరేందర్, రాజ్ కుమార్, రమేష్, కోటేశ్వర్, శాలరీ తదితరులు పాల్గొన్నారు.


Comments