ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లే లక్ష్యం: కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, జనవరి 8 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందించి, ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు కల్పించడమే తన ఏకైక లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్–3, ప్యాకేజీ–6 పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు.
జఫర్‌గడ్ మండలం సాగరం గ్రామ సమీపంలో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు ఫేజ్–3, ప్యాకేజీ–6 పనులను నీటిపారుదల, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకొని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, 2003–04లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించాలనే సంకల్పంతో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించామని గుర్తు చేశారు. మొదట 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు, సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుతం రూ.18,400 కోట్ల వ్యయానికి చేరిందన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న జనగామ ప్రాంతం నేడు దేవాదుల ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక వరిధాన్యం పండిస్తున్న ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు.
ప్యాకేజీ–6 ద్వారా ఒక్క జఫర్‌గడ్ మండలంలోనే సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. దంసా కాలువ, బంజరు మాటు, బొల్ల మత్తడిని మరమ్మత్తు చేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అలాగే దంసా చెరువు, జఫర్‌గడ్ చెరువులను పునరుద్ధరించి, నష్కల్ నుంచి పాలకుర్తి ప్రధాన కాలువ ద్వారా నీరు అందించి, చెరువుల్లో 365 రోజులు నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతుల భూ సమస్యల పరిష్కారానికి త్వరలో జఫర్‌గడ్ మండల కేంద్రంలో రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల వారీగా భూ సమస్యలపై నివేదికలు సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు వెంటనే పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని, అది సాధ్యం కావాలంటే అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, ఈఈ మంగీలాల్, డీఈలు, ఏఈలు, తహసీల్దార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
.


Comments