పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ యాత్ర సిగ్గుచేటు
కాలేశ్వరానికి ఇచ్చిన ప్రాధాన్యత పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదు ?
— వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ప్రశ్నించని బీఆర్‌ఎస్ నాయకులు, ఇప్పుడు యాత్రలు చేపట్టడం సిగ్గుచేటని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని నందిని సులో గల ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అని అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాటలకే పరిమితమయ్యాయని అన్నారు.రూ.27 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అస్తవ్యస్తంగా చేపట్టారని, ఒక ప్రాజెక్టు పూర్తికాకముందే మరో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. నార్లపూర్‌లో మోటార్ ఆన్ చేసి హెలికాప్టర్‌లో హైదరాబాద్ చేరేలోగానే బంద్ కావడం బీఆర్‌ఎస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు.ఈ సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments