బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
టీఆర్‌పి పార్టీ డిమాండ్‌తో తహసీల్దార్లకు వినతిపత్రం
వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు రవికుమార్
వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్”ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు టీఆర్‌పి పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండల కేంద్రాల్లో బుధవారం ఆయా మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జి. రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, చట్టపరమైన రక్షణ అత్యంత అవసరమని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా మిగులు చూపడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రతి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 50 శాతం పైగా నిధులు కేటాయించాలన్నారు.అలాగే బీసీల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. విద్యారంగంలో ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు.
నిరుద్యోగ బీసీ యువతకు, సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనలో బీసీలకు సంబంధించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.కేవలం నినాదాలతో కాకుండా, నిధులతో కూడిన చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ద్వారానే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌పి పార్టీ వనపర్తి జిల్లా జనరల్ సెక్రటరీ యూ. కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments