ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి
- *మున్సిపాలిటీల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది*
- *రూ. 3.17 కోట్ల పనుల శంకుస్థాపనలో మంత్రి వ్యాఖ్యలు*
ఖమ్మం బ్యూరో, జనవరి 9(తెలంగాణ ముచ్చట్లు)
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇల్లెందు మున్సిపాలిటీకి మహర్దశ పడుతుందని, పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని" పేర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని 1, 4, 7, 8, 9, 18, 22, 24 వార్డులలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇల్లెందును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి, మండలరాము, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 


Comments