టాటా ఎలక్ట్రానిక్స్‌లో సాయిస్ఫూర్తి విద్యార్థులకు ఉద్యోగాలు.
ప్రొడక్షన్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 53 మంది ఎంపిక.
సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని బి గంగారం గ్రామం సాయిస్ఫూర్తి ఆటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభను మరోసారి నిరూపించారు. టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కళాశాలకు చెందిన 53 మంది విద్యార్థినీ, విద్యార్థులు ప్రొడక్షన్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఎంపికైన వారిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 12 మంది, కంప్యూటర్ సైన్స్ & మెషిన్ లెర్నింగ్ నుంచి 11 మంది, ఏఐ & ఎంఎల్, ఏఐ & డీఎస్ విభాగాల నుంచి 18 మంది, ఈసీఈ నుంచి 4 మంది, ఈఈఈ నుంచి 8 మంది ఉన్నట్లు కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ వి. కృష్ణారెడ్డి తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు కళాశాల నుంచి 92 మంది విద్యార్థులు హాజరుకాగా, రాత పరీక్ష, టెక్నికల్, హెచ్‌ఆర్ మరియు మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక జరిగినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ స్థాయి ఎంపికల్లో తమ విద్యార్థులు నిలకడగా విజయాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలే ఈ విజయానికి కారణమని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు చివరి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే విధుల్లో చేరనున్నట్లు, చెన్నై, హైదరాబాద్ కేంద్రాల్లో ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. వీరికి సంవత్సరానికి రూ.2.4 లక్షల వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఫార్మాస్యూటికల్స్ అధినేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్‌గా విద్యార్థులను అభినందించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ టూర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్ని ఇంజనీరింగ్ విభాగాధిపతులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారులు, అధ్యాపకులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.


Comments