ఓటమితో వెనకడుగు కాదు.. గ్రామ అభివృద్ధికి అంకితంగా ముందుకు వెళ్తా
వెల్టూర్ కాంగ్రెస్ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె శేఖర్
పెద్దమందడి,జనవరి22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వడ్డె శేఖర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, గ్రామ ప్రజల సమస్యలపై తన పోరాటం ఏమాత్రం తగ్గదని తెలిపారు.గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని అన్నారు.ఇటీవల వెల్టూర్ సమీపంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డికి వడ్డె శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి వడ్డె శేఖర్ మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామానికి రైతులు, కూలీలు, వ్యాపారులు ఉపయోగపడేలా కూరగాయల వారంతపు సంత ఏర్పాటు చేయడం అత్యవసరమని అన్నారు.అలాగే గ్రామ ప్రజలకు ఆర్థిక లావాదేవీలకు సౌలభ్యం కల్పించే విధంగా బ్యాంకు లేదా బ్యాంకు శాఖ ఏర్పాటు అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా పరిసర గ్రామాలకు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామంలో అన్ని కులాలకు న్యాయం జరిగేలా కులాల వారీగా కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఎమ్మెల్యే సహకారంతో వాటిని అమలు అయ్యేలా ప్రయత్నిస్తానని అన్నారు.సర్పంచ్ పదవి రాకపోయినా గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పం తగ్గలేదని పేర్కొన్న వడ్డె శేఖర్, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, వెల్టూర్ గ్రామ భవిష్యత్తు కోసం ప్రజలతో కలిసి అడుగులు వేస్తానని ధృడంగా తెలిపారు.


Comments