కీసరలో యాంటీ డ్రంక్ డ్రైవ్ క్యాంపెయిన్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : పోలీస్ అధికారులు
కీసర, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” కార్యక్రమంలో భాగంగా, డీజీపీ మార్గదర్శకత్వంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రంక్ డ్రైవ్ క్యాంపెయిన్ నిర్వహించారు.కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, ఎస్‌ఐలు హరిప్రసాద్, నాగరాజులు సంయుక్తంగా కీసర గ్రామం ఎక్స్‌రోడ్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో ప్రవర్తనా మార్పు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రాణాంతక మరియు ప్రాణాంతకేతర రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వివరించారు. డ్రంక్ డ్రైవ్ కారణంగా ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగం, తప్పుదారి ప్రయాణం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా, సీటుబెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తాయని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల అనుభవాలను ప్రజలతో పంచుకొని అవగాహన కల్పించారు. డ్రంక్ డ్రైవ్ హాట్‌స్పాట్ మార్గాల్లో ప్రయాణించే డ్రైవర్లతో నేరుగా మాట్లాడి చట్టపరమైన శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్షల గురించి వివరించారు.అలాగే హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, లేన్ క్రమశిక్షణ, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.“డ్రంక్ డ్రైవ్ ఒక్క వ్యక్తి జీవితానికే కాదు, మొత్తం కుటుంబ భవిష్యత్తును నాశనం చేస్తుంది” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.


Comments