మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
*అభివృద్ధి... సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు*
- *పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*
ఖమ్మం బ్యూరో, జనవరి 10(తెలంగాణ ముచ్చట్లు)
‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం’’ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పాలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని విద్యానగర్‌లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో రూ. కోటి రెండు లక్షల యాభై వేల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నడిమితండాలో రూ. 77.10 లక్షలు, గొల్లగూడెంలో రూ. 37.20 లక్షలు, జలగంనగర్‌లో రూ. 29.30 లక్షలు, బారుగూడెంలో రూ. 24.27 లక్షలు, ఆటోనగర్‌లో రూ. 17.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి కష్టాలను పట్టించుకోలేదని, రేషన్ కార్డులు అడిగితే మొహం చాటేశారని మండిపడ్డారు. పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులే ఇవ్వకుండా దగా చేసిన గత పాలకుల తీరును ఎండగడుతూ.. తమ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ కార్డులు అందజేయడమే కాకుండా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణలో సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గతంలో హాస్టళ్లలో పేద పిల్లలకు సరైన తిండి పెట్టలేదని, తమ ప్రభుత్వం వచ్చాక డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను ఏకంగా 200 శాతం పెంచి పేద విద్యార్థులకు అండగా నిలిచామని వివరించారు. సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని, ఈ ప్రక్రియ దఫాలవారీగా నిరంతరం కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. పేదవారికి ఎల్లవేళలా అండగా ఉండే విధంగానే ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలని కోరారు.


Comments