సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో వైభవంగా సంక్రాంతి సంబరాలు.
సత్తుపల్లి, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని బి.గంగారం గ్రామంలో స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో బీటెక్ అన్ని బ్రాంచీలు, డిప్లొమా, ఎంబీఏ విద్యార్థినీ–విద్యార్థులు, సాయిస్ఫూర్తి సేవాసమితి, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడమని, ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారని తెలిపారు. మొదటి రోజు జోగి పండుగగా జోగి మంటలతో ప్రారంభమవుతుందని, రెండో రోజు సంక్రాంతి సందర్భంగా పాలు పొంగించి అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, గారెలు, సేమియాపాయసం, పరమాన్నం వంటి వంటకాలు తయారు చేసి, నూతన వస్త్రాలు ధరించి పండుగను ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. మూడవ రోజు కనుమ సందర్భంగా రైతులు తమకు ఎంతో ఉపయోగపడే పశువులను శుభ్రపరచి పూజలు నిర్వహిస్తారని వివరించారు. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ప్రజలు శ్రద్ధాభక్తులతో మూడు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు.
పండుగలో భాగంగా కళాశాల ప్రాంగణంలో ముగ్గుల (రంగోలి) పోటీలను నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో కళాశాల వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ పోటీల్లో బాలికలతో పాటు బాలురు కూడా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థినీ–విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో కళాశాల ప్రాంగణం సందడి చేసింది.
ఈ కార్యక్రమాల నిర్వహణకు రాచమళ్ళ శ్రీదేవి, సిహెచ్ లీలావతి (ట్రస్టీ), కె. వాసవి, జె. రాజకళ, యన్. సుధారాణి, ఎం. రాణి, యం. ప్రతిమ, జి. రాణి, యం.ఎన్.వి. సత్యవేణి, టి. నాగలక్ష్మి, చింతల శైలజలు బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికులు, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్‌గా పాల్గొని ఫ్యాకల్టీ సభ్యులకు, విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, అన్ని విభాగాల అధిపతులు, ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డీన్ వి. కృష్ణారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.


Comments