జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం అవాస్తవం
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం
హైదరాబాద్ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల గౌరవాన్ని తగ్గించాలన్నా,చిన్నబుచ్చాలన్నా ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన తెలిపారు.జీవో 252పై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాలు చేసిన విలువైన సూచనలు, విజ్ఞప్తులను పరిశీలించి జీవో 252లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు.అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఖండించారు.గతంలో జారీ చేసిన సుమారు 23 వేల అక్రిడిటేషన్ కార్డుల కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో శాస్త్రీయ అధ్యయనం చేపట్టామని, దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలను పరిశీలించామని తెలిపారు. ఈ ప్రక్రియ కారణంగా కొంత జాప్యం జరిగిందని స్పష్టం చేశారు.మీడియా కార్డు, అక్రిడిటేషన్ కార్డుల మధ్య ఎలాంటి తేడా లేదని, అక్రిడిటేషన్ కార్డుదారులకు లభించే అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు మీడియా కార్డుదారులకూ వర్తిస్తాయని మరోసారి స్పష్టం చేశారు. సర్క్యులేషన్ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్లను ఖచ్చితంగా పరిశీలించడం ద్వారా అసలైన పత్రికలు, నిజమైన పాత్రికేయులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
మండలానికి ఒక విలేకరి ప్రాతిపదిక కాకుండా జనాభా ఆధారంగా అక్రిడిటేషన్లు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతికం, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేసిన ఘనత రాష్ట్రానిదేనని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, పెన్షన్, బస్‌పాసులు, బీమా వంటి అంశాలపై ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులకు మంత్రి సావధానంగా స్పందించారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్పష్టత జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై స్పందించిన మంత్రి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించి జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించిందన్నారు. అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మళ్లీ తలెత్తినప్పటికీ, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.


Comments