తెలుగుదనం ఉట్టిపడేలా విశ్వశాంతి విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు.
గంగిరెద్దుల విన్యాసాలు, దాసుల గానం, కోడి పందాలతో పల్లె వాతావరణం.

సత్తుపల్లి, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కట్టు–బొట్టు, వేషధారణ ఉట్టిపడేలా శనివారం స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా, హుషారుగా నిర్వహించారు. మామిడాకుల తోరణాలు, బంతిపూల దండల అలంకరణలతో విద్యాలయ ప్రాంగణం పల్లె వాతావరణాన్ని తలపించింది. గంగిరెద్దులు, కోడిపుంజులు, హరిదాసులు, సోదిమ్మ తదితర సంప్రదాయ వేషధారణలతో విద్యార్థులు సందడి చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సంక్రాంతి ఆనందాలను వేడుక రూపంలో కనువిందు చేశారు. చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. సంక్రాంతి వైభవాన్ని ప్రతిబింబించే పాటలకు సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజు అయిన భోగి ప్రాధాన్యతను తెలియజేస్తూ కోలాట నృత్యాలతో భోగిమంటల చుట్టూ ఉత్సాహంగా నర్తించారు. హరిదాసుల గానం, కోడిపందాల ప్రదర్శనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు, భోగి పళ్ళు, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అనేక సంవత్సరాలుగా హరినామ కీర్తనలతో ఆకట్టుకుంటున్న రమణతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు ప్రదర్శించిన కళాకారులను ఈ సందర్భంగా సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం సభ్యులు పసుపులేటి నాగేశ్వరరావు, నరుకుల్ల సత్యనారాయణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


Comments