సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
సమావేశంలో డిమాండ్
హన్మకొండ,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో సింగరేణి విశ్రాంతి కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కడార్ల ప్రకాశ్ చారి అధ్యక్షత వహించారు. విశ్రాంతి కార్మికులు చాలీచాలని పెన్షన్‌తో జీవనం సాగిస్తూ అనారోగ్యాల పాలవుతున్న పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసంగా పదివేల రూపాయల పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని, ఆరోగ్య బీమా పరిమితిని పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని సభలో గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యే కామినేని సాంబశివరావు అసెంబ్లీలో విశ్రాంతి కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెన్షన్ పెంపు, తెల్ల రేషన్ కార్డుల జారీ అంశాలపై డిమాండ్ చేశారని తెలిపారు. ఇందుకు ఇరువురికీ సభ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన కార్యదర్శి చిదరాల సత్యనారాయణ మాట్లాడుతూ, సింగరేణి విశ్రాంతి కార్మికుల పెన్షన్ విధానాన్ని వేజ్ బోర్డులో కలపాలని డిమాండ్ చేశారు. సీఎం పీఎఫ్ ఆర్గనైజేషన్ ట్రస్టులో బోర్డు సభ్యులతో సంప్రదించి వేజ్ బోర్డులో పెన్షన్ అంశాన్ని చేర్చేందుకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ కోసం కార్మికుల నుంచి ఏడు శాతం, యజమాన్యం నుంచి ఏడు శాతం చొప్పున చందా తీసుకుంటున్నారని, ప్రతి టన్నుకు ఇరవై రూపాయల చొప్పున సీఎంపీఎఫ్‌కు జమ చేస్తున్నారని వివరించారు.
కోల్ ఇండియా పెన్షనర్లతో కలిసి సమిష్టిగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి పట్టుదలతో సిద్ధమవ్వాలని కోరారు. సమావేశానికి హాజరైన యాభై మంది సభ్యులు ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు.ఈ సమావేశంలో నలబాల దామోదర్, రామ్మూర్తి, ప్రభాకర్, జి వెంకటేశ్వర్లు, ఎస్‌కే అస్సన్, విద్యాసాగర్, కమలాకర్ రావు, కోటా రాజిరెడ్డి, రమేష్ కుమార్, రవీంద్ర గుప్త తదితరులు మాట్లాడి తమ సలహాలు సూచనలు అందించారు. చివరగా అధ్యక్షుల కృతజ్ఞతలతో సమావేశం ముగిసింది.


Comments