నాచారంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం
నాచారం, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని ఎర్రకుంటలో ఉన్న పటేల్ కుంట చెరువుకు సంబంధించిన సివరేజ్ డైవర్షన్ పనుల్లో జరిగిన భారీ అవకతవకలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోటి 80 లక్షల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన కీలక పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పటేల్ కుంట చెరువులోకి మురుగునీరు చేరకుండా అరికట్టేందుకు జిహెచ్ఎంసి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సుమారు మూడు సంవత్సరాల క్రితం సివరేజ్ డైవర్షన్ పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు కేవలం 80 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన పనులను మధ్యలోనే నిలిపివేయడంతో చెరువులోకి మురుగునీరు యథావిధిగా చేరుతోంది.ఈ విషయమై నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పలుమార్లు ఇరిగేషన్ అధికారులను పనులు పూర్తి చేయాలని కోరినా, “కాంట్రాక్టర్ రావడం లేదు” అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.తాజా విచారణలో వెలుగులోకి వచ్చిన నిజం ఏమిటంటే, సరైన డిజైన్, సరైన లెవెల్ లేకుండా పనులు చేపట్టిన కారణంగా అధికారులు బిల్లులు చెల్లించిన తర్వాత కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలి వెళ్లినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఇది అధికారుల నిర్లక్ష్యానికి, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారింది.ఈ అంశంపై కార్పొరేటర్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ కు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శనివారం రోజు విజిలెన్స్ సీఐ అమృత్ రెడ్డి, విజిలెన్స్ ఏఈ రోహిత్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు, కమురుద్దీన్ తదితరులు సిబ్బందితో కలిసి పటేల్ కుంట చెరువు వద్దకు చేరుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలన అనంతరం ఈ పనులు పూర్తిగా అధికారుల మరియు కాంట్రాక్టర్ తప్పిదం వల్లే ప్రజలకు ఉపయోగం లేకుండా పోయాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై జిహెచ్ఎంసి కమిషనర్‌కు పూర్తి స్థాయి నివేదిక అందజేస్తామని వారు తెలిపారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “ఎవరి మీద వ్యక్తిగత కక్షతో ఫిర్యాదు చేయలేదు. ప్రజాధనంతో చేపట్టిన పనులు సరైన డిజైన్, సరైన లెవెల్‌తోతిరిగి నిర్మించి చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటే నాచారం ప్రాంతంలో దోమల సమస్య పూర్తిగా తొలగిపోతుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, మంగోల్ శివకుమార్, చంద్రశేఖర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments