జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ రోజు వరకు 773 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి యూరియా సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6.00 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు సాగుకు పూర్తిగా సరిపోతాయని, అవసరాన్ని బట్టి అదనపు సరఫరాలు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా పంపిణీపై సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు.
యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని రైతులను కోరారు.


Comments