ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు
శతాబ్ది ఉత్సవ ముగింపు సభకు సన్నద్ధమవుతున్న ఖమ్మం
ఖమ్మం బ్యూరో, జనవరి 11(తెలంగాణ ముచ్చట్లు)
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు విస్తృత ప్రచారం జరుగుతుంది. అదే రీతిలో -సభను జయప్రదం చేసే క్రమంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. లక్షలాది మంది ఈ సభకు హాజరు కావడంతో పాటు 15వేల మంది జనసేవాదళ్ కార్యకర్తలు నగర వీధుల్లో కవాతు చేయనున్నారు. జనసేవాదళ్ కార్యకర్తలతో పాటు ప్రదర్శనలో పాల్గొనే -సిపిఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల బాధ్యులు కుడిచేతితో జెండా పట్టుకుని ఎడమ చేయి పైకెత్తి నినదించే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 40వేల జెండాలను సిద్దం చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పార్టీ కార్యాలయంలో సిపిఐ కార్యకర్తలు కర్రలకు జెండాలను అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. మరో పక్క ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ నేపథ్యం, పోరాట చరిత నేటి తరానికి తెలియజేయడంతో పాటు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పాలకుల వైఖరి ప్రజా పోరాటాల అవసరాలను తెలియజేస్తూ ఫ్లేక్సీలను ఏర్పాటు చేస్తున్నారు..
అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిచ్చేవిధంగా ప్రత్యేకంగా కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13న ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ బెలూన్లను ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. 14న జిల్లా వ్యాప్తంగా ఇంటింటిపై ఎర్రజెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలను సంసిద్దులను చేశారు. ఇప్పటికే జీపుజాతాలు ద్వారా రెండు దఫాలు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించగా ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ ఆటోల ద్వారా శతాబ్ది -సంబురాల ముగింపు సభ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క 40 దేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానం -పలకడంతో పాటు సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులకు స్వాగత బ్యానార్లను ఏర్పాటు చేస్తున్నారు. 12న కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రచార కార్యక్రమాలతో ఒక పక్క ప్రచారం మరో పక్క ముమ్మర ఏర్పాట్లతో సభను జయప్రదం చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా యావత్ యంత్రాంగం నిమగ్నమైంది.


Comments