క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
వెల్టూర్ సర్పంచ్ అశోక్
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వెల్టూర్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే నిజమైన క్రీడాస్ఫూర్తి అని అన్నారు.క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, యువతలో క్రమశిక్షణ, సహనం, జట్టు స్పూర్తి అలవడతాయని తెలిపారు. గ్రామీణ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు క్రీడలు ఉత్తమ మార్గమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామంలో ఐక్యత, స్నేహభావాలను పెంచుతాయని అన్నారు.
ఈ సందర్భంగా గతంలో అస్తవ్యస్తంగా ఉన్న క్రీడా మైదానాన్ని గ్రామ నూతన సర్పంచ్ అశోక్ చొరవతో శుభ్రం చేయించడం జరిగింది. అలాగే టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులకు టీ షర్ట్స్‌ను సర్పంచ్ అశోక్ స్వయంగా డొనేట్ చేశారు, దీనికి క్రీడాకారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని, యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments