రోడ్డు భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.
- ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యతగా భావించాలి.
- ఎమ్మెల్యే జారె.ఆదినారాయణ.
అశ్వారావుపేట, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం–2026 కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ సతీష్ కుమార్, సీఐ నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్మల, దమ్మపేట, అశ్వారావుపేట ఎస్సైలు సాయి కిషోర్ రెడ్డి, యయాతి రాజు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు విజయ్ పాల్గొని తమ పరిధిలోని అంశాలపై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యత అని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి నిర్లక్ష్యం యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగంతో ప్రయాణించడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొంటూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, యువత రోడ్డు నిబంధనలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తరఫున గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి తమ ప్రాణ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని కోరారు.


Comments