“అరైవ్ అలైవ్ – 2026”లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం
కుషాయిగూడ, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ – 2026” కార్యక్రమంలో భాగంగా గురువారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తల్లూరి థియేటర్ జంక్షన్ మరియు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ ప్రాంతాల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఏసీపీ వై. వెంకట్ రెడ్డి నాయకత్వంలో జరిగింది. ఇందులో కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ రామ లక్ష్మణ రాజు పాల్గొని, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా, కుషాయిగూడ పోలీసులు విద్యార్థులతో కలిసి తల్లూరి థియేటర్ జంక్షన్ నుండి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ వరకు రహదారి భద్రతా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ వద్ద మానవ గొలుసు ఏర్పాటు చేసి, ప్రజలను చురుకుగా ఈ ప్రచారంలో భాగస్వాములను చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఏసీపీ వై. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు. ముఖ్యంగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని స్పష్టంగా తెలిపారు.విద్యార్థులు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ వద్ద ఫ్లాష్ మాబ్ ప్రదర్శన నిర్వహించి, రహదారి భద్రతా నియమాలను ఆకర్షణీయమైన రీతిలో ప్రజలకు చేరువ చేశారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, బి. శ్రీనివాస్, ఎం. విజయ్, కె. సతీష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Comments