ఒకరి రక్తదానం… ముగ్గురికి ప్రాణదానం.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం.
సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ సహకారంతో సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ, ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం చేసినట్లేనని అన్నారు. రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని, రక్తదానం చేసిన వ్యక్తి మరొకరికి ప్రాణం పోసినట్లేనని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సత్తుపల్లి శాఖ అందించిన సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సత్తుపల్లి అధ్యక్షులు గోగడ రవికుమార్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ముఖ్యంగా రక్తదాన శిబిరాల నిర్వహణలో భాగస్వాములవడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్‌కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవికుమార్, పి. రమేష్, వి. జగన్మోహన్‌రావు, జె. సత్యనారాయణ, విశ్వశాంతి స్కూల్ కరస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు, ఆర్టీసీ విబిఓ కిన్నెర ఆనందరావు, డీఐ ప్రభాకర్, సేఫ్టీ వార్డెన్ రఘురాం, కాంతారావు, ఏడీసీలు వెంకటయ్య, బాలస్వామి, ఇజ్రాయిల్, జాకబ్, ఆనందం, వెల్ఫేర్ కమిటీ మెంబర్ సైదిరెడ్డి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments