మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
రాంపూర్,జనవరి22(తెలంగాణ ముచ్చట్లు):
మతం ఒక ఆచారంగా పరిమితమయ్యే చోట, మానవత్వాన్ని జీవన విధానంగా మార్చుకున్న వ్యక్తి ఫాదర్ జెరోమ్. మూడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న సేవా ప్రయాణం మతపరమైన పరిధులను దాటి, సమాజంలోని అట్టడుగు మనుషుల జీవితాల్లో ఆశగా నిలుస్తోంది.
దిక్కులేని అనాధలు, వితంతువులు, వృద్ధులు, మానసిక వికలాంగులు, నిరాశ్రయులు… వీరంతా ఫాదర్ జెరోమ్ సేవా ప్రయాణానికి కేంద్ర బిందువులు. ఎవరు ఏ కులానికి, ఏ మతానికి చెందినవారన్న ప్రశ్న ఆయన వద్ద ఉండదు. అవసరం ఉన్న మనిషే ఆయనకు గుర్తింపు. ఒక్కరోజు సాయం చేసి వెళ్లిపోవడం కాదు, వారి జీవితాల్లో భరోసా కలిగే వరకు తోడుగా ఉండాలన్నదే ఆయన సేవలో కనిపించే మానవత్వం.
ఈ మానవత్వానికి నిదర్శనంగా ధర్మసాగర్ మండలం స్టేషన్ రాంపూర్‌లోని జీవదార దివ్య కేంద్రంలో గురువారం మానసిక వికలాంగులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 53 గ్రామాల నుంచి 200కు పైగా మానసిక వికలాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని ఫాదర్ జెరోమ్ కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ అని, దేవునికి కులం, మతం, జాతి వంటి భేదాలు ఉండవని ఫాదర్ జెరోమ్ తెలిపారు. సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన ఆరాధనగా భావించాలని అన్నారు. ముఖ్యంగా అనాధలు, వితంతువులు, మానసిక వికలాంగుల సేవలోనే దేవుడిని చూడగలమని పేర్కొన్నారు. అదే ప్రేరణతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 200 కుటుంబాలను స్వయంగా సందర్శించి, వారి కష్టాలను తెలుసుకొని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు.
ఫాదర్ జెరోమ్ సేవలు మాటలకే పరిమితం కావు. కష్టంలో ఉన్న వారి ఇంటి ముంగిట ఆయన అడుగులే సాక్ష్యం. ఆకలితో ఉన్నవారికి అన్నం, దుస్తులు లేనివారికి వస్త్రం, ఆశ కోల్పోయినవారికి ఓ ధైర్య వాక్యం… ఇవన్నీ ఆయన సేవలో భాగాలే. ఇది దానం కాదు, బాధ్యత అన్న భావన ఆయన చర్యల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
సేవ కూడా ప్రచారంగా మారుతున్న ఈ కాలంలో, ఎలాంటి హంగు లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా సాగుతున్న ఫాదర్ జెరోమ్ సేవలు అరుదైనవి. ఆయన చేస్తున్న పని పెద్ద శబ్దంతో కనిపించకపోయినా, అనేక జీవితాల్లో నిశ్శబ్దంగా వెలుగు నింపుతోంది.ఫాదర్ జెరోమ్ ఒక వ్యక్తి మాత్రమే కాదు. మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ. సమాజానికి అద్దం పట్టే జీవితం.


Comments