కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
రూ.3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
సత్తుపల్లి, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ శుక్రవారం కల్లూరు మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.3 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 11, 16, 17, 19, 20 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే, డాక్టర్ మట్టా దయానంద్ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలపై ప్రజలు వినిపించిన అంశాలను గమనించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో భాగంగా గోపాలకుంట, శాంతినగర్, అంబేద్కర్ నగర్, పుల్లయ్య బంజార్, వచ్య నాయక్ తండా, ఏకలవ్య నగర్, బోడెమల్లె ప్రాంతాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయ్యితే ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సులభమవడంతో పాటు వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి వార్డులో సమానంగా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాగమయి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,
మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments