లచ్చన్నగూడెం ఐకెపి కొనుగోలు కేంద్రంలో రైతులకు చుక్కెదురు.!
- మిల్లర్ల దగాతో లక్షల రూపాయల నష్టం.
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా.
సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత సారవ వరి సీజన్‌లో ధాన్యం విక్రయించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేలకొండపల్లి చెందిన సహస్ర రైస్ మిల్లు, అరుణాచల శివ రైస్ మిల్లుల యాజమాన్యాలు ప్రతి క్వింటా ధాన్యానికి 14 కిలోల చొప్పున అక్రమంగా కటింగ్ చేసి, ట్రక్ షీట్లలో తక్కువ బరువు చూపించి వాటికే గాను రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దగాతో మొత్తం 24 మంది రైతులు బోనస్‌తో కలిపి సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోయినట్లు నిర్ధారించుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గురువారం రైతులు ప్రదర్శన నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మిల్లర్ల అక్రమాలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మిల్లుల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయబ్ తహశీల్దార్ బంతిరాంకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఐకెపి సిబ్బంది ట్రక్ షీట్లలో బస్తాల సంఖ్య, క్వింటాళ్ల వివరాలను నమోదు చేసినప్పటికీ, మిల్లర్లు వాటిని ఎలా తక్కువగా రాసి సంతకాలు, ముద్రలు వేస్తున్నారని ప్రశ్నించారు. గ్రేడ్-ఏగా ధాన్యం నిర్ధారించిన తర్వాత కూడా కోతలు విధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిని స్వీకరించిన నాయబ్ తహశీల్దార్ బంతిరాం స్పందిస్తూ, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్‌తో పాటు బాధిత రైతులు ఇమ్మడి మల్లేశ్వరరావు, నాయుడు శ్రీనివాసరావు, బోయినపల్లి సత్యనారాయణ, రాయల నరసింహారావు, ఇమ్మడి శంకర్‌రావు, అన్నపురెడ్డి కృష్ణయ్య, పతేపరుపు అంజారావు, హనుమంతరావు, మాణికల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.


Comments