బీఆర్ఎస్–సీపీఎం సంయుక్తంగా పోటీ.
- సత్తుపల్లి మున్సిపాలిటీని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
సత్తుపల్లి, ఫిబ్రవరి 4 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. బుధవారం సత్తుపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 23 వార్డుల్లో 22 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నామినేషన్ ఉపసంహరించుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
02వ వార్డులో పార్టీ నిర్ణయాన్ని అతిక్రమించి ఒక అభ్యర్థి పోటీలో కొనసాగుతున్నారని, వెంటనే తప్పుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్–సీపీఎం కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది ఏమీ లేదన్నారు. భారతరత్న అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు, నూతన మున్సిపాలిటీ కార్యాలయం, అశోకచక్రం, జాతీయ జెండా వంటి పనులు తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. 37 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, ఇప్పటికీ పాత ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో కూడా లేని విధంగా సత్తుపల్లిలో గ్రంథాలయం ఏర్పాటు చేశామని, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి తమ పాలనలోనే జరిగిందన్నారు. షాదీఖానా, అంబేడ్కర్ భవన్, క్రైస్తవ భవన్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, సత్తుపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దామని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల్లో పాలకులు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులు తీసుకొచ్చారా? బాధితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమపై దుష్ప్రచారం జరుగుతోందని, అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల వ్యాపారాలను అడ్డుకుంటామని, లారీల్లో గంజాయి పెట్టేస్తామని భయపెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అభ్యర్థులను బరిలో నిలిపామని, స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా నిధులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అన్న భావన తప్పుడుదని, అభివృద్ధి చేయగల నాయకత్వమే ముఖ్యమన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీని ప్రజలు తమకు అప్పగిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ, కారు గుర్తుకు ఓటేసి 22 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులను, సుత్తి–కొడవలి గుర్తుకు ఓటేసి సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో కూరాకుల నాగభూషణం, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేష్, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మోరంపూడి ప్రభాకర్, అమరవరపు కృష్ణారావు, సత్యనారాయణ రెడ్డి, భారతి, మోరంపూడి పాండు, రాజబాబు, మహమూద్, పర్వతనేని వేణు, వల్లభనేని పవన్ తదితరులు పాల్గొన్నారు.


Comments