పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
జిహెచ్ఎంసి – కర్కినోస్ – ఒరాకిల్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
మల్కాజిగిరి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి మరియు కర్కినోస్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఒరాకిల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిహెచ్ఎంసి సర్కిల్ మల్కాజిగిరి, మౌలాలి, అల్వాల్ సర్కిళ్లకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓరల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ ఉచిత హెల్త్ క్యాంపును మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు ఈ హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు.క్యాంపులో ఏవైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లయితే, కర్కినోస్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ మరియు ఒరాకిల్ సంస్థలు పూర్తి స్థాయిలో నయం అయ్యేంతవరకు ఉచిత వైద్య సేవలు అందిస్తాయని స్పష్టం చేశారు. కార్మికులు మద్యం, పొగాకు, సిగరెట్లు, గుట్కా, తంబాకు వంటి దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విధులు నిర్వహించే కార్మికులు తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
ఎక్కువ శాతం కార్మికులు పేదరిక నేపథ్యం నుండి వచ్చినవారైనందున, అనారోగ్యానికి గురైతే కుటుంబాలు మరింత ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే వైద్య పరీక్షలకు భయపడకుండా, ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ముందుగానే చేయించుకోవాలని, తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో పద్మజ, ముఖ్య ఆరోగ్య అధికారి, జిహెచ్ఎంసి మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని కార్మికులందరికీ దశలవారీగా బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓరల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారంలో మరోసారి సమగ్ర స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్, ముఖ్య వైద్యాధికారి పద్మజ, డాక్టర్ కే. మంజుల, మౌలాలి డిప్యూటీ కమిషనర్ గోపాల్ రావు, సానిటరీ సూపర్వైజర్ చింత శ్రీనివాస్, ఏఈ కిరణ్ పవర్, శానిటరీ జవాన్ భాస్కరరావు,
గోవిందమ్మ, వెంకటేష్ గిరి, ఎస్‌ఎఫ్‌ఏ సిబ్బంది, మల్కాజిగిరి–మౌలాలి సర్కిళ్లకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు, కర్కినోస్ హెల్త్ కేర్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.


Comments