డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘనపూర్, జనవరి 26: తెలంగాణ ముచ్చట్లు
77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని స్టేషన్‌ఘనపూర్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి పౌరుడికి—ఉన్నవారు, లేనివారు, చదువుకున్నవారు, చదువుకోనివారు అనే తేడా లేకుండా, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సమాన హక్కులు కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం ఒకటిగా గుర్తింపు పొందిందని, ఈ మహత్తర రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కొందరు కావాలనే రాజ్యాంగ విలువలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా దళితులు, బీదలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. కులం, మతం పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు.
రానున్న రోజుల్లో రాజకీయ వ్యవస్థలో విలువలు క్రమంగా క్షీణిస్తూ, రాజకీయాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా ఉండాల్సిన రాజకీయాలు స్వార్థ ప్రయోజనాలకు పరిమితమవుతున్నాయని అన్నారు. ఒకప్పుడు రైతు తన వ్యవసాయంలో కష్టపడి ఫలితాన్ని పొందినట్లే, రాజకీయాల్లో కూడా క్రమశిక్షణ, విలువలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాలు దిశ తప్పిన వ్యవసాయంలా మారడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాద సంకేతమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments