భారతరత్న కర్పూరి ఠాకూర్ నాయి సేవలు చిరస్మరణీయం
— నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర అధ్యక్షులు యలమందల జగదీష్
— ఖమ్మంలో ఘనంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ నాయి 102వ జయంతి ఉత్సవాలు
ఖమ్మం బ్యూరో, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు )
నాయి బ్రాహ్మణ సమాజ ముద్దుబిడ్డ, భారతరత్న అవార్డు గ్రహీత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ నాయి గారి సేవలు చిరస్మరణీయమైనవని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ కొనియాడారు. ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాకూర్ నాయి 102వ జయంతి ఉత్సవాలు శనివారం ఖమ్మం నగరంలోని నాయి బ్రాహ్మణ కమిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర అధ్యక్షులు యలమందల జగదీష్ పాల్గొని కర్పూరి ఠాకూర్ నాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్పూరి ఠాకూర్ తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంకితం చేశారని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, సామాజిక గౌరవం కల్పించేందుకు ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదల పాలిట నిజమైన ప్రజానాయకుడిగా కర్పూరి ఠాకూర్ నిలిచారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసి, సమాజ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ గౌరవ సలహాదారులు దోమకొండ నాగేశ్వరావు, వర్కింగ్ ప్రెసిడెంట్లు తుపాకుల కృష్ణ, శ్రీపతి రామనాథం, ప్రచార కార్యదర్శి ఇల్లందుల కనకయ్య, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గరిడేపల్లి నవీన్, ఈసీ మెంబర్ మాదారపు బిక్షంతో పాటు కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమం చివర్లో కర్పూరి ఠాకూర్ నాయి ఆశయాలను కొనసాగిస్తూ, సమాజ సేవలో ముందుండాలని ప్రతిజ్ఞ చేశారు. జై నాయి – జై జై నాయి. నాయి బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.


Comments