గురుకుల బాలికల పాఠశాల ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ
నాచారం, జనవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ నాచారం డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల ఉప్పల్ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు, అలాగే 6, 7, 8 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలకు సంబంధించిన ప్రవేశాల నమోదు పోస్టర్‌ను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థినుల విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. మైనారిటీ గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని మైనారిటీ తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలని కోరారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థినుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసంలోనూ విద్యార్థినులు ముందంజలో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో మంచి స్పందనను రేపింది.


Comments