అశ్వారావుపేట రింగ్‌రోడ్డు సెంటర్‌లో వ్యాపారస్తుల ధర్నా.
- తక్షణమే రోడ్డు పూర్తి చేయాలి.
- ధూళితో వ్యాపారాలకు తీవ్ర ఇబ్బందులు.
అశ్వారావుపేట, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట పట్టణంలోని రింగ్‌రోడ్డు సెంటర్ వద్ద రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రింగ్‌రోడ్డు సెంటర్ వద్ద స్థానిక వ్యాపారస్తులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
పూర్తికాకుండా వదిలేసిన రోడ్డు పనుల కారణంగా రోజంతా ఎగిసిపడుతున్న ధూళి వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు వాపోయారు. దుకాణాల్లోకి ధూళి చేరి సరుకులు పాడవుతున్నాయని, కస్టమర్లు రాకపోవడంతో ఆదాయం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు, మహిళలు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
చాలా కాలంగా రింగ్‌రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రింగ్‌రోడ్డు పనులను వేగవంతం చేసి తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వ్యాపారస్తులు స్పష్టం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యాపారస్తులతో చర్చలు జరిపినట్లు సమాచారం.


Comments