వెల్టూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హామీ
మండల కేంద్రం అంశంపై సీఎం దృష్టికి ఫైల్ తీసుకెళ్తామని స్పష్టం
పెద్దమందడి,జనవరి25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పరిధిలోని వెల్టూర్ గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మేఘా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెల్టూర్ గ్రామానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే పరిసర గ్రామాలకు పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడతాయని నాయకులు వివరించారు.అలాగే వెల్టూర్ నుంచి సోలిపూర్ వరకు బీటి రోడ్డును విస్తరించి బలపర్చాలని, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మినీ బ్యాంకు ఏర్పాటు చేయాలని కూడా వినతిపత్రం ద్వారా అభ్యర్థించారు.ఈ అన్ని అంశాలపై ఎమ్మెల్యే మేఘా రెడ్డి సానుకూలంగా స్పందించారు. కొత్త మండలాల ఏర్పాటు సంబంధిత ఫైల్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రోడ్లు, రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.వెల్టూర్ గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె శేఖర్, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రమేష్, తిరుపతయ్య, దాసరి కురుమన్న తదితరులు పాల్గొన్నారు.


Comments