వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
రూ.81 కోట్లతో పనులు – రెండేళ్లలో పూర్తి చేస్తాం : ఎంపీ ఈటల రాజేందర్
నేరేడ్మెట్, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్ లో వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే నిర్మాణ పనులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. రూ.81 కోట్ల వ్యయంతో ఈ కీలక పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ…తాను మంత్రిగా ఉన్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. అప్పట్లో రైల్వే పట్టాలపై నిర్మించే ఒక బ్రిడ్జికి కేవలం రూ.6 కోట్లు మాత్రమే రైల్వే శాఖ ఇచ్చిందన్నారు. కేంద్ర–రాష్ట్ర నిధుల నిబంధనల కారణంగా అనేక రైల్వే బ్రిడ్జి పనులు తీవ్ర జాప్యానికి గురయ్యాయని తెలిపారు.2014లో మల్కాజిగిరిలో శిలాఫలకం వేసిన బ్రిడ్జి ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. రోజుకు 50 వేల కార్లు ప్రయాణించే చోటే బ్రిడ్జి అవసరం ఉంటే, 10 లక్షల కార్ల ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా బ్రిడ్జులు నిర్మించకపోవడం దురదృష్టకరమన్నారు.
2022లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల రైల్వే ప్రాజెక్టులకు పూర్తి నిధులు రైల్వే శాఖే భరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాల సహకారం లేకపోవడం వల్లే అనేక ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.1993లో బొల్లారంలో శంకుస్థాపన చేసిన బ్రిడ్జి పనులు 33 ఏళ్లయినా ప్రారంభం కాలేదని తెలిపారు. ఎంఎంటీఎస్ రైల్వే లైన్‌కు రూ.1043 కోట్ల వ్యయ ప్రతిపాదనలో రాష్ట్రం చెల్లించాల్సిన రూ.400 కోట్లు ఇవ్వకపోవడంతో, మొత్తం నిధులు రైల్వే శాఖే భరించి ప్రాజెక్టు పూర్తి చేసిందన్నారు.
తాను ప్రధానికి లేఖ రాయడం, నాలుగుసార్లు కమిటీ సమావేశాలు నిర్వహించడం ద్వారా రైళ్ల వేగం, ఫ్రీక్వెన్సీ పెరిగాయని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజలు, పశువులు రైల్వే పట్టాలపైకి రాకుండా ఉండేందుకు 100 ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు.రాష్ట్రంలో చిన్న పనులకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ దుస్థితికి నిదర్శనమని విమర్శించారు. తాను ప్రజల కోణంలోనే పని చేస్తానని, అధికారంలో ఎవరు ఉన్నారన్నది తనకు ముఖ్యం కాదన్నారు.జిహెచ్ఎంసీ సమావేశాల్లో మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 45 మంది కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయడం తన బాధ్యతగా తీసుకుని, తన జోక్యంతో రూ.4 వేల కోట్ల నిధులు సాధించామని తెలిపారు. చిన్న పనికైనా దరఖాస్తు పట్టుకుని వెళ్లడం తన నైజమన్నారు.పదవులు శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యమే శాశ్వతమని స్పష్టం చేశారు. తాను కులం, మతాలకు అతీతంగా ప్రజలే తన హైకమాండ్, ప్రజలే తన దేవుళ్లని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సూచించిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రూ.81 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జి పనులను రెండేళ్లలో పూర్తి చేయిస్తామని, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే శుభకార్యాలేనని అన్నారు.

సభలు బలప్రదర్శనకు వేదికలు కాకూడదని, పరస్పర గౌరవంతో ప్రజాస్వామ్యం పరిపుష్టి చెందాలని సూచించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా రక్షణ మంత్రితో చర్చిస్తామని తెలిపారు.


Comments