కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
కీసర, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అరైవ్ అలైవ్–2026’ ప్రాజెక్టు మరియు డీజీపీ బి. శివధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా కీసర పోలీస్ శాఖ విస్తృత స్థాయి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమాన్ని కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్‌ఐలు హరి ప్రసాద్, నాగరాజు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో కీసర గ్రామంలో నిర్వహించారు.కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అధిక వేగం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్యాల వల్ల ఎదురయ్యే నష్టాలు, వైద్య ఖర్చులు, జీవితాంతం కొనసాగే శారీరక-మానసిక వేదనలు, కుటుంబంపై పడే ఆర్థిక, భావోద్వేగ ప్రభావాలను వారు వివరించారు.అనంతరం నిర్వహించిన ఇంటరాక్షన్ సెషన్‌లో ప్రజలు తమ సందేహాలను వ్యక్తపరచగా, పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితంగా వాహనం నడిపే విధానం, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమం ముగింపులో పాల్గొన్న ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించేలా ప్రోత్సహిస్తామని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు.ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు కోరారు.



Comments