ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
- *18న జిల్లాకు రేవంత్ రెడ్డి రాక*
- *ఏర్పాట్లను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీజ, సీపీ సునీల్ దత్*
ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి పరిధిలో జరగనున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ప్రాంతాలను వారు సందర్శించారు.
ఈ సందర్భంగా ఇన్ చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సింగ్ కళాశాల సమీపంలో హెలీప్యాడ్‌ను డీజీసీఏ ప్రమాణాల మేరకు సిద్ధం చేయాలని, అక్కడ అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. సీఎం కాన్వాయ్ కోసం అత్యుత్తమ వాహనాలను ఎంపిక చేయాలని, ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక వైద్య బృందం, 108 వాహనాన్ని వెంట ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రికి వివరించేందుకు శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని జిల్లాలో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాస రెడ్డితో పాటు ఇరిగేషన్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments