కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
_పేదల భూములకు రక్షణగా ప్రభుత్వం నిలవాలి : ఎంపీ ఈటల రాజేందర్
కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ శుభకార్యం తో పాటు ప్రజలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని, అత్యధిక జనసాంద్రత ఉన్న ఈ ప్రాంతంలో మిగిలిన ఖాళీ స్థలాలను కబ్జాలు చేయడం గానీ, వేలం వేసి అమ్మడం గానీ కాకుండా ప్రజలకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడేలా పార్కులుగా అభివృద్ధి చేయాలని సూచించారు.నలభై, యాభై ఏళ్ల క్రితం ఏర్పడిన లే అవుట్లలోని పార్క్ స్థలాలు, స్కూల్ స్థలాలను బై నంబర్లతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అన్ని చోట్ల సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.
సివిల్ తగాదాలు, భూ వివాదాలకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారడం మంచిది కాదని, రెవెన్యూ శాఖే భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పేదలను వేధిస్తున్న వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని, అవసరమైతే కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.హెచ్ఎంటి, ఐడిపిఎల్ భూముల్లో 60 గజాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూలగొట్టవద్దని స్పష్టం చేశారు. బడాబాబులు అక్రమంగా ఆక్రమించిన భూములను మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోవాలని అన్నారు. పేదలపై కఠినత్వం, పెద్దలపై నిర్లక్ష్యం అనే భావన ప్రజల్లో ఏర్పడిందని, ఇది మంచిది కాదని తెలిపారు.ఈ అంశాలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. అలాగే ప్రీ బుకింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పెద్ద కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.డిఎస్ఆర్ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిఎస్ఆర్ నిధులతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. అన్ని పార్టీల వారిని పిలిచి మాట్లాడే అవకాశం కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.


Comments