కిష్టారం – తాళ్లమడ రహదారి మృత్యుమార్గంగా మారింది.!
తమ్మిలేరు వంతెన వద్ద వరుస ప్రమాదాలు.
సత్తుపల్లి, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణ పరిధిలోని కిష్టారం నుంచి తాళ్లమడ వరకు సాగాల్సిన ప్రధాన రహదారి ప్రజలకు మృత్యుమార్గంగా మారుతోంది. సత్తుపల్లి దాటిన అనంతరం ఉన్న తమ్మిలేరు వంతెన ప్రాంతం వరుస రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఈ వంతెన వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో లారీలు, భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయిన ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండటంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయని పేర్కొంటున్నారు.
తమ్మిలేరు వంతెన వద్ద ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు అలైన్‌మెంట్ లోపమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజంగా నేరుగా సాగాల్సిన రహదారిని అకస్మాత్తుగా వంకరలతో మలిచిన కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, వర్షాకాలంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
వంతెనపై గుంతలు, సరైన రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని వాపోయారు.
రహదారి నేరుగా నిర్మించి ఉంటే ఇన్ని ప్రమాదాలు చోటుచేసుకునేవి కావని, ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వంతెన ప్రమాదకరమని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక మరమ్మత్తులు, గుంతల పూడికతోనే సరిపెట్టారని, ప్రజల భద్రతపై నిర్లక్ష్యం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తమ్మిలేరు వంతెన అలైన్‌మెంట్‌ను తక్షణమే నిపుణుల కమిటీతో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వంతెనపై ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
ఇది రాజకీయ అంశం కాదని, అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రజల ప్రాణాల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని వారు స్పష్టం చేశారు.
. ఈ విషయంపై బీజేపీ పార్టీ కూడా అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


Comments