ఆన్‌లైన్ వర్క్ పేరుతో ఆశాలపై వేధింపులు ఆపాలి
కోటి కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్స్ ధర్నా
హైదరాబాద్, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆశా వర్కర్లపై ఆన్‌లైన్ వర్క్ పేరుతో జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. అనిత అధ్యక్షత వహించారు. అనంతరం జాయింట్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే ఆశాలతో అధికంగా ఆన్‌లైన్ పనులు చేయిస్తున్నారని విమర్శించారు. ఆన్‌లైన్ పనులపై పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సర్వే బిల్లులను వెంటనే చెల్లించాలని, ఆశాలపై దుర్భాషలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.జిల్లా యూనియన్ జనరల్ సెక్రటరీ ఏం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ, యువిన్, ఎంసీటీసీ కిట్లు, ఈ–సంజీవని, ఈ–ఔషధి, ఎన్సీడీ, సీ–బ్యాంక్, స్క్రీనింగ్, ఫాలోఅప్స్ వంటి పనులను సరైన శిక్షణ, వసతులు కల్పించకుండా ఆశాలతో ఆన్‌లైన్‌లో చేయిస్తున్నారని తెలిపారు. రోజుకు 50 నుంచి 100 ఎంట్రీలు చేయాలంటూ టార్గెట్ల పేరుతో వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, నెట్ రీచార్జీలకు ఎటువంటి ఖర్చులు చెల్లించకుండానే తక్కువ పారితోషికాలతో ఆశాలను ఖరీదైన ఫోన్లు కొనాలని ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బాలనగర్ పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఏడు మంది ఆశా వర్కర్లకు అక్టోబర్ నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఏ. అశోక్, యూనియన్ జిల్లా నాయకులు ప్రవీణ, కోమలత, వర్కింగ్ కమిటీ సభ్యుడు ఉన్నికృష్ణన్, బాలనగర్ సీఐటీయూ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments