స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తిజనవరి12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ..స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారని, ఆయన జయంతిని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. స్వామి వివేకానంద గొప్ప భారతీయ వేదాంతవేత్త, యోగా గురువుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడని, రామకృష్ణ మిషన్‌ను స్థాపించి హిందూ మతం, వేదాంత తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని వివరించారు.1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమావేశంలో సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించిన ప్రసంగం ద్వారా హిందూ మత గొప్పతనాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పారని గుర్తు చేశారు. నా ఆశలన్నీ నవతరంపైనే అంటూ యువతను ఉద్దేశించి స్వామి వివేకానంద చేసిన పిలుపు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగి తమ కాళ్లపై తాము నిలబడాలని యువతను ఆయన జాగృతం చేశారని పేర్కొన్నారు.ఆత్మవిశ్వాసం ఉంటే ఏ కార్యాన్నైనా సాధించవచ్చని, పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తే ఆత్మవిశ్వాసం విజయతీరాలకు నడిపిస్తుందని స్వామి వివేకానంద యువతకు బోధించారని తెలిపారు. నేటి కాలంలో అంతర్జాలం, ఓటీటీలు, సినిమాల ప్రభావంతో యువత గాడి తప్పి మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, యువత మేలుకొని మాదకద్రవ్యాలను అరికట్టి దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.నైతిక విలువలను పెంపొందించి, మనోబలం–బుద్ధిని వికసింపజేసి, స్వశక్తిపై నమ్మకం పెంచే విద్య దేశానికి అత్యవసరమని అన్నారు.యువత క్రీడల్లో ముందుండాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారని గుర్తు చేస్తూ, ఆయన బోధనలు వేలాది మందిని, ముఖ్యంగా యువతను ఉత్తేజపరిచాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, శంకర్ గౌడ్, వనపర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాగి అక్షయ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, పెద్దమందడి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వెంకటేష్ సాగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, అబ్దుల్లా, నందిమల్ల రాము, జానంపేట నాగరాజ్, నందిమల్ల సందీప్, రాంబాబు, ఎంట్ల రవి, విజయ్, చీర్ల రాజేష్, బాల్రాజ్, సిరివాటి సురేష్, చెన్నయ్య, పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments