వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి
పెద్దమందడి మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రమేష్ డిమాండ్
పెద్దమందడి,జనవరి12(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని పెద్దమందడి మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా ప్రజల నుంచి బలమైన డిమాండ్ వినిపిస్తోందన్నారు. ఈ డిమాండ్‌ను సాధించేందుకు గతంలో వెల్టూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా మద్దతు తెలిపారని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి కూడా వెల్టూర్‌ను మండల కేంద్రంగా ప్రకటిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని రమేష్ గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు.జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వెల్టూర్ గ్రామానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులు కూడా అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెల్టూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుందని రమేష్ అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గుర్తించి వెంటనే నిర్ణయం తీసుకుని వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆయన మరోసారి గట్టిగా కోరారు.


Comments