డీఏల పెండింగ్‌తో ఉద్యోగుల ఆందోళన.!

డీఏల పెండింగ్‌తో ఉద్యోగుల ఆందోళన.!

- ఆరు డీఏల బకాయిల భారంతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు.

సత్తుపల్లి, జనవరి 3 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, 2026 జనవరి నాటికి మరో డీఏ వచ్చి చేరనుంది. దీంతో మొత్తం ఆరు డీఏల బకాయిల భారం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపై పడుతోంది. డీఏల పెండింగ్ అంశంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యావసర ధరలు పెరుగుతున్న వేళ, పెరగాల్సిన డీఏలు విడుదల కాకపోవడం కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ముగిసే నాటికి సుమారు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కోవిడ్ ప్రభావం, ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పట్లో డీఏల విడుదలకు జాప్యం జరిగిందని అప్పటి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జూన్ 2024లో ఒక డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మరో మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా, 2026 జనవరిలో వచ్చే డీఏను కలిపితే నాలుగు డీఏలు ఈ ప్రభుత్వ హయాంలోనే పెండింగ్‌గా ఉన్నట్లవుతోంది. అధికారంలోకి వస్తే డీఏలు వెంటనే క్లియర్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య పెద్దగా తేడా లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒకవైపు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు జరుగుతుండగా, మరోవైపు ఉద్యోగుల డీఏలు వాయిదా పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కేబినెట్ ఆమోదం పొందిన డీఏల జీవోల జారీకి కూడా జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పెరిగిన వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరల మధ్య డీఏ అందకపోవడం వారి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14.56 శాతం డీఏ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇది ఒక్కో ఉద్యోగికి నెలకు వేల రూపాయల మేర ఆర్థిక భారంగా మారుతోంది. రెండో పీఆర్సీ నివేదిక కూడా ఆలస్యం కావడం ఉద్యోగుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. డీఏల పెండింగ్ సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం